మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్​హయాంలో విద్యాశాఖమంత్రిగా పనిచేసి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తేలేని అసమర్థుడు జగదీశ్​రెడ్డి అని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ శాఖమంత్రిగా ఉండి సూర్యాపేటకు ఎన్ని సబ్ స్టేషన్లు తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చివ్వేంల మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 కంటే ముందు రెండెకరాల భూమి ఉన్న జగదీశ్ రెడ్డికి ఇప్పుడు రూ.2 వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. 

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. దేవుడి పేరు చెప్పుకొని బీజేపీ నాయకులు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరన్న నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.