జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీశ్ రెడ్డికి లేదు : రాంరెడ్డి దామోదర్ రెడ్డి

  • మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : మాజీ మంత్రి జానారెడ్డిని విమర్శించే స్థాయి జగదీశ్ రెడ్డికి లేదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జానారెడ్డిపై జగదీశ్ రెడ్డి చేసిన వాఖ్యలను ఖండించారు. ఎస్సారెస్పీ గోదావరి జలాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్​దేనన్నారు.

విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ తెచ్చిన సబ్ స్టేషన్లను ఆయన తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డబ్బుల కోసం సద్దాల చెరువు సుందరీకరణ పేరుతో చెరువు కెపాసిటీ తగ్గించారని మండిపడ్డారు. పదేండ్లలో గ్రామాలకు రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథకు ముందు పాలేరు నుంచి కృష్ణ జలాలను కాంగ్రెస్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

మెయిన్ రోడ్ వెడల్పుపేరుతో పేదల ఇండ్లను కూల్చివేసి నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లోపు జగదీశ్ రెడ్డి ఆస్తులెన్ని.. ఇప్పుడెన్నో వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డికి దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్​విసిరారు.