సూర్యాపేట, వెలుగు: అమరుల త్యాగాలు, విద్యార్థుల బలిదానాలు చూసి చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట, ఆత్మకూరు(ఎస్) మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, రైతులకు రుణమాఫీ, మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు వంటి హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాముడి పేరుతో ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. నరేంద్ర మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్మాత్రమేనని తెలిపారు. ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు వేణురెడ్డి, సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్, నాయకులు పాల్గొన్నారు.