భవన నిర్మాణానికి కృషి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి

  • మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట చేనేత సహకార సంఘం నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీసీసీ సభ్యుడు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పోతు భాస్కర్ సోమవారం సూర్యాపేటలోని దామోదర్ రెడ్డి నివాసంలో  ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత, జౌళి కార్మికుల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.168 కోట్లు కేటాయించిందన్నారు. 

చేనేత అభయ హస్తం మూడు పథకాలు చేనేత కార్మికుల అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. జియో ట్యాగ్ సహకార సంఘం భవనం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చినవారిలో చేనేత పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి భిక్షం, సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కోశాధికారి మల్లయ్య, నాయకులు తదితరులు ఉన్నారు.