- మాజీ మంత్రి రవీంద్ర నాయక్
హైదరాబాద్, వెలుగు : మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతలు అసభ్యకరంగా ట్రోలింగ్చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ధరావత్ రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. నాటి ఫోన్‌ట్యాపింగ్‌లో బయటపడిన అంశాలనే మంత్రి సురేఖ మాట్లాడారని, ఆమెపై పరువు నష్టం దావా వేయడం బాధాకరమన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోని రాజకీయ నేతలు, సినీనటులు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్చేశారు.
భార్యాభర్తల మధ్య సంభాషణలను కూడా విన్నారని ఎంక్వైరీలో పోలీస్ఆఫీసర్లు చెప్పారు. సినీ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్చేయించి, బ్లాక్మెయిల్ చేసినట్టు బయటపడింది. ఢిల్లీ స్థాయిలో దేశభద్రతకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మాయమయ్యాయనే వార్తలు వచ్చాయి. కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం వల్లే ఫోన్ట్యాపింగ్జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఫోన్‌ట్యాపింగ్ చేయించిన బీఆర్ఎస్ నేతలే వెనుక ఉండి ఓ బీసీ మహిళా మంత్రిపై పరువు నష్టం దావా వేయించడం ఎంతవరకు సమంజసం?’ అని రవీంద్ర నాయక్ ప్రశ్నించారు.