సండ్ర గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం : సంభాని చంద్రశేఖర్

  • మాజీమంత్రి సంభాని  వార్డుల్లో ఎంపీ డాక్టర్​ 
  • బండి పార్థసారథిరెడ్డి ప్రచార హోరు

సత్తుపల్లి, వెలుగు :  సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోళ్ల అప్పారావు సహా పలువురికి శుక్రవారం మండల పరిధిలోని కాకర్లపల్లిలో ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో మహాకూటమి తరుపున పోటీ చేసిన వెంకటవీరయ్య గెలుపునకు తాను కృషి చేశానని, ఇప్పుడు మరోసారి ఆయన భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. సండ్ర గెలుపుతో సత్తుపల్లి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను పదవుల కోసం కాదని, విలువలతో కూడిన రాజకీయం చేస్తానని తెలిపారు. 

వార్డుల్లో ‘బండి’ పర్యటన

సత్తుపల్లి పట్టణంలో తొమ్మిది వార్డుల్లో ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ప్రచారంలో పాల్గొన్నారు. వెంగళరావునగర్ లో 60 కుటుంబాలు కాంగ్రెస్ ను వీడి బీఆర్​ఎస్​లో చేరాయి. 

పతి కోసం సతీమణి ప్రచారం..

సండ్ర గెలుపు కోసం ఆయన సతీమణి మహాలక్ష్మి జోరుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని 22 ,23 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించారు. మరోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే పనులను వివరించారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, నాయకులు రఫీ, అంకమా రాజు, సాల్మన్ రాజు, కాలం క్రిష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.