హైదరాబాద్: కేటీఆర్ పైనే పదే పదే డ్రగ్స్ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని, ఆయనకు దమ్ముంటే వెళ్లి నార్కొటిక్ పరీక్షలు చేయించుకొని రిపోర్టు బయటపెట్టాలని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి వారం కేటీఆర్ బామ్మర్ది రేవ్ పార్టీ పెడుతున్నారనే సమాచారం పోలీసులకు ఉందన్నారు. హవాయి చెప్పులతో తిరిగిన వాళ్లకు ఇప్పుడు హవాయి జహజ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేటీఆర్ ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతల సమయంలో కేటీఆర్.. జన్వాడ ఫాంహౌస్ తో తనకు సంబంధం లేదన్నారని, తన దోస్త్ ఫాంహౌస్ అని కూడా చెప్పారని గుర్తు చేశారు.
కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే వస్తాయని చెప్పారు. పీటీ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు జైలుకు పంపి జైలుకు పంపారని గుర్తు చేశారు. జైల్లో హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు. అలాంటి రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు సీఎంను చేశారని అన్నారు. విచారణలన్నీ సీఎం క్యాంప్ ఆఫీసులోనే జరిగాయని, కేసీఆర్ ఏమైనా జడ్జీయా..? అని ప్రశ్నించారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం లీటర్ లిక్కర్, ఆరు బీర్లు మాత్రమే ఉండాలని, అంతకన్నా ఎక్కువ లిక్కర్‌తో దావత్ చేసుకోవాల్సి వస్తే ఆబ్కారీ అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ చెప్పారు.