మాస్టర్ ప్లాన్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు: షబ్బీర్ అలీ

కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ విషయంలో తనపై వస్తున్న ఆరోపణల గురించి వివరిస్తూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో తనకు 13,14 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని, 15 ఏండ్ల క్రితంమే భూమిని కొనుగోలు చేసినట్లు, 5 ఏండ్ల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు స్పష్టంచేశారు. అమ్మకానికి ప్రపోజల్ వచ్చినా భూమిని అమ్మలేదన్నారు. మాస్టర్ ప్లాన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, మాస్టర్ ప్లాన్ రోడ్డుకు తన భూమికి చాలా దూరం ఉంటుందని చెప్పుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుగా స్పందించి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు.

గతంలో ఇబ్రహీంపట్నం భూముల విషయంలో ఇలానే జరిగిందన్నారు. భూమిని సేకరించి ఒక్కొక్క రైతుకు 5 లక్షలిచ్చి 12 కోట్లకు, కోకాపేటలో ఎకరం భూమిని 60 కోట్లకు అమ్ముకున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ఇదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. అక్కడి రైతులు సమస్యపై తనను కలిస్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కుమార్ ఐఏఎస్ తో మాట్లాడి, తన పర్సనల్ సెక్రెటరీ ద్వారా వినతిపత్రం కూడా పంపించానని వెల్లడించాడు. ఆ విషయంపై రేపు సాయంత్రంలోగా స్పష్టత వస్తుందని తెలిపారు.

ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ కు తనకు సంబంధం ఉన్నట్లు బీజేపీ నేత వెంకట రమణారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ఆ మాటలు అర్ధరహితమని మండిపడ్డాడు. ఆయనది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ, కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వ్యక్తి, రమణారెడ్డికి తన చేతుల మీదుగా నాలుగు సార్లు బి ఫార్మ్ ఇచ్చానన్నాడు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్సీగా బి ఫార్మ్ తీసుకొని, నామినేషన్ రోజు సింగిల్ గా వెళ్లి విత్ డ్రా చేసుకున్నాడని చెప్పాడు. నమ్మకంతో పార్టీ టికెట్ ఇస్తే కోట్లకు అమ్ముడుపోయాడని ఆరోపించాడు.

రూ. 2 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నా అని  వెంకట రమణారెడ్డి ప్రచారం చేశాడని  షబ్బీర్ అలీ మండిపడ్డాడు. ఎందుకు విత్ డ్రా అయ్యవని వెంకట రమణారెడ్డిని అడిగితే ఈటల రాజేందర్ ఫోన్ తో కేసీఆర్ ఫోన్ చేసి తనను బెదిరించినట్లు ప్రచారం చేసుకున్నాడని చెప్పాడు. ఈ విషయాలన్నీ అవాస్థవాలని షబ్బీర్ అలీ కొట్టి పడేశాడు. మీడియా సమావేశంలో ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తే  వెంకట రమణారెడ్డి మధ్యలోనే వెళ్ళిపోయాడని గుర్తుచేశాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు తనకు 100ల ఎకరాలు ఉందని బద్నాం చేస్తున్నారని అన్నాడు.

కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎవరి వద్ద ఒక్క రూపాయి ఆశించకుండా పనిచేశానని షబ్బీర్ అలీ అన్నాడు. మూడు నెలల పాటు అబ్దుల్లా నగర్ శివారు సమస్యపై మాట్లాడినా, ఆ సమస్య పరిష్కారం కాలేదని, అక్కడి రైతులకు న్యాయం జరిగలేదన్నారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో తన ఇల్లు కూడా పోతుందని, గతంలో కూడా 80 ఫీట్ల రోడ్డు విస్తీర్ణంలో తన ఇల్లు 20 ఫీట్ల పోయిందని గుర్తు చేశారు. ప్రజల అవసరాల మేరకు అవన్నీ పట్టించుకోలేదని స్పష్టం చేశాడు. అధికారంలో ఉంటే బురద జల్లే ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుందని, 15 ఏళ్లుగా అధికారంలో లేని తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.