- 1300 కోట్ల బిల్లులు పెండింగ్
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో పరిపాలన పడకేసిందని, సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తోందని, ఇంకా రూ.1300 కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ ల పరిస్థితి దారుణంగా తయారైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావొస్తున్నా.. ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
గవర్నర్ ను కలిసి ఇప్పటికే సర్పంచులు మొరపెట్టున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.600 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, సర్పంచ్ లు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపి సర్పంచ్ లకు ఇవ్వాలని కోరారు.