పాలేరు, ఖమ్మం మాకు రెండు కళ్లు : తుమ్మల

  • పదికి పది స్థానాల్లో కాంగ్రెస్​ను గెలిపించాలి
  • తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ విజ్ఞప్తి
  • పాలేరుకు పెద్ద పాలేరుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నా: తుమ్మల
  • అహంకారి కేసీఆర్​ను ఇంటికి పంపించాలి: పొంగులేటి

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమకు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు రెండు కళ్లు అని చెప్పారు. ఇద్దరి ఎజెండా ఒక్కటేనని తెలిపారు. పాలేరు, ఖమ్మంలోని కాంగ్రెస్​కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఒక్కటిగా ముందుకెళ్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో బుధవారం కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పాలేరుకు పెద్ద పాలేరుగా ఉంటానని చెప్పిన మాటను నిలుపుకున్నానని చెప్పారు. ఇక నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే విధంగా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా ఇన్నేళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నామని, భవిష్యత్తులోనూ ఇదే పద్ధతిని పాటిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్​లీడర్లు, క్యాడర్​ను అనేక మంది రెచ్చగొడుతున్నారన్నారు. ఎలాంటి పట్టింపులకు పోకుండా పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారం లేకున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక కేసులతో భయభ్రాంతులకు గురిచేసినా ఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని, నిరంకుశ బీఆర్ఎస్​ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి విజయాన్ని అందించాలని కోరారు. కేసీఆర్ ఇన్నేళ్లు మాయమాటలతో పాలన సాగించారని విమర్శించారు. అధికార మదం, అహంకారంతో వ్యవహరిస్తున్న కేసీఆర్​ను ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, సాధు రమేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కోరం కనకయ్యకు ఇల్లెందు టికెట్​ ఇయ్యొద్దు

ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గంలో ఉదయ్​పూర్​డిక్లరేషన్​అమలుచేయాలని కాంగ్రెస్​టికెట్​ఆశావహులు డిమాండ్ చేశారు. బుధవారం ఇల్లెందులోని ఐఎన్​టీయూసీ ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోయిందని చెప్పారు. పార్టీ లీడర్లు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించారన్నారు. ఇటీవల కాంగ్రెస్​లోకి వచ్చిన కోరం కనకయ్యకు ఇల్లెందు టికెట్​ఇవ్వొద్దని డిమాండ్​చేశారు. కార్యకర్తలు ఆయన్ని నమ్మే పరిస్థితి లేదని, కనకయ్యకు కాకుండా 31 మంది ఆశావహుల్లో ఎవరికి టికెట్​ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

పదేళ్లుగా పార్టీనే అంటి పెట్టుకుని ఉన్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పాటయ్యాక కనకయ్యకు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోవాలని సూచించారు. లంబాడా సామాజిక వర్గానికి చెందినవారికే ఇల్లెందు సీటు కేటాయించాలని కోరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనకయ్య విషయంలో మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆశావహులు భూక్యా దళ్ సింగ్ నాయక్, డా.గుగులోత్ రవి, డా.భూక్యా రామచంద్ర నాయక్, బానోత్ వెంకట ప్రవీణ్ నాయక్, డా.శంకర్ నాయక్, ఆరేం పాపారావు, శంకర్ నాయక్, భూక్యా స్రవంతి, నాయకులు పసిక తిరుమల్, బీఎన్ గోపాల్, కమల, దారావత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడెంను సీపీఐకు కేటాయించలే: కాంగ్రెస్

భద్రాద్రికొత్తగూడెం: మాజీ ఎంపీ, పీసీపీ ప్రచార కమిటీ కో చైర్మన్​పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ లీడర్లు కోరారు. చుంచుపల్లి మండలంలోని పొంగులేటి క్యాంప్​ఆఫీస్​లో బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వూకంటి గోపాల్​రావు, ఆళ్ల మురళి, నాగ సీతారాములు మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నాయకులు పిచ్చిరెడ్డి, గంగాధర్, ఖయ్యూమ్​ పాల్గొన్నారు.