ఖమ్మం, వెలుగు: పాలేరు సభలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ తన స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2018 ఎన్నికల్లో పాలేరులో తన ఓటమికి కేటీఆరే కారణమని ఆరోపించారు. ‘‘నా ఓటమికి కారణమెవరో మీ అంతరాత్మకు తెలుసు.
ఆయన ఫ్రెండ్ పువ్వాడ అజయ్‌ని మంత్రిని చేయడం కోసం, ఆయనతో కలిసి వ్యాపారాలు చేయడానికి, బాచుపల్లిలో మమత మెడికల్ కాలేజీ పెట్టుకోవడానికి.. మీ కొడుకే నా ప్రత్యర్థికి డబ్బులిచ్చి నన్ను ఓడించింది నిజం కాదా? ఇది మీకు తెలిసీ ఏమీ చేయలేకపోయింది నిజం కాదా? నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించింది నీ కొడుకు కాదా? పార్టీ భ్రష్టుపట్టి పోవడానికి కారణం మీరు కాదా?” అని కేసీఆర్‌ను తుమ్మల ప్రశ్నించారు. ‘‘పదవుల కోసం, అవసరాల కోసం పార్టీలు మారిన పువ్వాడ అజయ్‌కి ప్రభుత్వ భూములు కట్టబెట్టి, కందాల ఉపేందర్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టి వాళ్లను పక్కన పెట్టుకుని పార్టీల మార్పు గురించి మీరు మాట్లాడడం హాస్యాస్పదం” అని విమర్శించారు.