నేటి రాజకీయాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి : తుమ్మల

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి రాజకీయాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని అన్నారు. ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేతలైన మంచికంటి, రజబ్ అలీ, బొడేపూడితో కలసి తాను గతంలో పని చేశానని, ప్రస్తుత రాజకీయాలు ఎబ్బెట్టుగా ఉన్నాయన్నారు. గత నాలుగైదు ఏళ్లుగా ప్రజా వ్యతిరేక పాలనతో జనం విసుగెత్తారని చెప్పారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలన్నారు. దేశం కోసం త్యాగం చేసిన సోనియాగాంధీ కుటుంబం వల్లే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. 

భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని రాహుల్​ గాంధీ ఐక్యం చేశారని అన్నారు. కాంగ్రెస్​ పార్టీ అధిష్టానం ఆదేశాలతో తాను ఖమ్మంలో.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు బరిలో ఉంటామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదింటిలో పది స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాలో అరాచక శక్తులను తరమికొట్టాలన్నారు.అభివృద్ధి రాజకీయాలకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. 

తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్నేరులో ఈత కొట్టే వారితో సరదాగా గడిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమని స్విమ్మర్స్ నినాదాలు చేశారు.  ఖమ్మం నగరంలోని పలువురు ప్రముఖులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు తుమ్మలకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు.