ఖమ్మం జిల్లా ప్రజల కోసం ఎన్నికల్లో నిలబడతానని చెప్పారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. తల నరుక్కుంటా తప్ప.. ఎక్కడా తలవంచేది లేదన్నారు. తన వల్ల ఎవరూ తలదించుకోవద్దన్నారు. జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నానని తుమ్మల అన్నారు. రాజకీయాలకు స్వస్తి పలుకుతానని సీఎంకు కూడా చెప్పిన కానీ.. ప్రజల ఆందోళన, అభిమానం చూశాక తన మనసు మార్చుకున్నానని చెప్పారు. జిల్లా ప్రజల కోసమే రాజకీయ జీవితం తప్ప..తనకు పాలిటిక్స్ అవసరం లేదన్నారు తుమ్మల.
గోదావరి జలాలతో జిల్లా ప్రజల కాళ్లు కడిగే వరకు రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు తుమ్మల. జిల్లా ప్రజలపై తనకు నమ్మకం ఉందని.. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తనకు పదవి అలంకారం, ఆధిపత్యం, అహంకారం కోసం కాదని..ప్రజల కోసమే పదవులన్నారు. తనను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే ప్రజల ముందుకు వచ్చానన్నారు. తనను తప్పించారని కొందరు శునకానందం పొందుతున్నారు..ఎవర్నీ నిందించబోనని.. ఎన్నికల్లో చూపిస్తానని సవాల్ విసిరారు.
అంతకుముందు ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వెళ్లారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావుకు నాయకన్ గూడెం వద్ద ఆయన అనుచరులు భారీగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ జెండాలు లేకుండానే తుమ్మల వందల కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు.