ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం రూరల్, వెలుగు: హత్యకు గురైన కృష్ణయ్య లేని లోటు తీర్చలేనిదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కృష్ణయ్య దశ దిన కార్యక్రమాన్ని గురువారం మండలంలోని తెల్దారుపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణయ్య లాంటి నిబద్ధత కలిగిన నాయకుడి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన భార్య ఎంపీటీసీ మంగతాయిని ఓదార్చారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి తదితరులు కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తాతా మధు, వివిధ పార్టీల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, మహ్మద్​ మౌలానా, తక్కెళ్లపల్లి నరేందర్​రావు, బెల్లం వేణు, ఉమ, బానోత్​ శ్రీనివాస్, యండపల్లి ప్రసాద్, సాధు రమేశ్​రెడ్డి, రామసహాయం నరేశ్​రెడ్డి, ధరావత్​ కృష్ణ, వీరన్న, అంబటి సుబ్బారావు, సప్పిడి ప్రభాకర్​పాల్గొన్నారు. 

ఎంపీ వద్దిరాజు నివాళి 

కృష్ణయ్య దశ దిన కార్యక్రమం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. ముందుగా కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీ వెంట గ్రానైట్ అసోసియేషన్  ప్రతినిధులు పారా నాగేశ్వరరావు, వేముల రవికుమార్, తీగల విజయ్, లీడర్లు శాఖమూరి రమేశ్, వేగినాటి రామారావు, నెల్లూరి వినోద్  ఉన్నారు.

నిందితులను కఠికంగా శిక్షించాలి

కృష్ణయ్య హత్య కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు విజ్ఞప్తి చేశారు. గురువారం సీపీ విష్ణు ఎస్​ వారియర్​ను కలిసి హత్యకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి తెల్దారుపల్లిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

రామయ్యకు పట్టాభిషేకం

భద్రాచలం,వెలుగు: పుష్యమి నక్షత్రం సందర్భంగా గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం స్వామికి గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించిన తర్వాత కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. స్వామికి నిత్య కల్యాణం చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత రక్షాబంధనం, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుక, పట్టాభిషేకం చేశారు. ప్రత్యేక పూజల అనంతరం రామయ్యకు రాజదండం, రాజముద్రిక సమర్పించి కిరీటం అలంకరించి పట్టాభిషిక్తుడిని చేశారు. ఈ సందర్భంగా రామయ్యకు రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను అలంకరించారు. కృష్ణా జిల్లా బాపులపాడు గ్రామానికి చెందిన భక్తుడు వడ్డిపట్ల సత్యనారాయణ స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు. నీతి ఆయోగ్​ స్పెషల్​ సెక్రటరీ డా.కె.రాజేశ్వరరావు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్రు

భద్రాచలం, వెలుగు: ఐటీడీఏ ఆఫీస్​ వెనక ఉన్న మనుబోతుల చెరువు ప్రభుత్వ భూముల్లో గురువారం కొందరు గుడిసెలు వేసుకున్నారు. భద్రాచలం టౌన్​లోని సుభాష్​నగర్, శ్రీరాంనగర్, మనుబోతుల చెరువు ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా పేదలు గుడిసెలు వేసుకున్నారు. ఇటీవల భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి భూముల్లో గుడిసెలు నిర్మించగా, దేవస్థానం ఆఫీసర్లు అడ్డుకోవడంతో వాటిని తొలగించారు. తాజాగా వారంతా కలిసి మనుబోతుల చెరువు ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేశారు. 

సీలింగ్​ భూములపై విచారణ జరపాలి

జూలూరుపాడు, వెలుగు: మండలంలోని గుండెపూడిలోని సర్వే నెంబర్ 117లో గిరిజనేతరులు అక్రమంగా పట్టాలు పొందిన సీలింగ్​ భూములపై సర్వే చేపట్టాలని సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు యాస నరేశ్, గుండెపిన్ని వెంకటేశ్వర్లు డిమాండ్​ చేశారు. గురువారం సీపీఐ, సీపీఎం నాయకులు వివాదాస్పద భూమిని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీలింగ్ భూములను కొందరు గిరిజనేతరులు అక్రమంగా  పట్టాలు పొంది చదును చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి వాస్తవాలు తెలపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తహసీల్దార్  ఆఫీస్​ను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. మధు, గడిదేసి కనకరత్నం, లాకావత్ శ్రీను, చాంద్ పాషా, గార్లపాటి వెంకటి, వల్ల చందర్రావు, అఖిల్, బానోతు మధు, బొల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.  

హమాలీలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి

కల్లూరు, వెలుగు: హమాలీలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏ వెంకన్న, తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్  మిల్ వర్కర్స్  ఫెడరేషన్  రాష్ట్ర కార్యదర్శి జి రామయ్య డిమాండ్​ చేశారు. ఖమ్మం జిల్లా హమాలీ అండ్  మిల్  వర్కర్స్  యూనియన్  జిల్లా మూడవ మహాసభ కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సరైన భద్రత లేదని, చట్టబద్ధమైన హక్కులు లేక శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.   సంఘం జిల్లా కోశాధికారి ఎన్ సీతారాములు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసరావు. ఐఎఫ్టీయూ లీడర్లు కె పుల్లారావు, ఎస్కే లాల్మియా. ఏ శరత్, బి లాజర్, కె శ్రీనివాసరావు, బి సత్యం, ఎం నాగేశ్వరరావు, కృష్ణ పాల్గొన్నారు.

కానిస్టేబుల్​ ఎగ్జామ్స్​కు 49 సెంటర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 28న జరగనున్న పోలీస్​ కానిస్టేబుల్​ ప్రిలిమినరీ ఎగ్జామ్​కు జిల్లాలో 49 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్​ వినీత్​తెలిపారు. కేఎస్ఎం కాలేజీలో ఎగ్జామ్​ సెంటర్ల రీజనల్​ కో ఆర్డినేటర్లు, చీఫ్​ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. 17,077 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో 39, భద్రాచలంలో 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. బయోమెట్రిక్​ విధానం ద్వారా అభ్యర్థులను ఎగ్జామ్​ సెంటర్లలోకి అనుమతిస్తామని చెప్పారు. ఎగ్జామ్​కు నోడల్​ ఆఫీసర్​గా ఏఆర్​ అడిషనల్​ ఎస్పీ డి శ్రీనివాసరావు, కొత్తగూడెం, భద్రాచలంలోని ఎగ్జామ్​ సెంటర్లకు రీజనల్​ కో ఆర్డినేటర్లుగా పున్నం చందర్​, భద్రయ్య వ్యవహరిస్తారని తెలిపారు. వెబ్​సైట్​ ద్వారా డౌన్​లోడ్​ చేసుకున్న హాల్​ టికెట్​పై అభ్యర్థి పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటోను తప్పనిసరిగా అతికించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి ఆభరణాలు ధరించవద్దని, లగేజీ తీసుకొని రావొద్దని అన్నారు. ఏఎస్పీ రోహిత్​రాజు, డీఎస్పీలు వెంకటేశ్వరబాబు, సత్యనారాయణ, ఎస్​బీ ఇన్​స్పెక్టర్​ స్వామి, ఐటీ సెల్​ ఇన్​స్పెక్టర్​ నాగరాజు, ఆర్ఐలు సోములు, కామరాజు, దామోదర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ అన్నారు. కొత్తగూడెం క్లబ్​లో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్​ అధ్యక్షతన గురువారం నిర్వహించిన యూనియన్​ జిల్లా స్టాండింగ్​ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మోడల్​గా నిలుస్తుందని చెప్పారు. టీఎన్జీవో  నేతలు రామారావు, చైతన్య మాట్లాడుతూ ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతం రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. జిల్లాలో వెల్​నెస్​ సెంటర్​ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎస్​ రద్దు చేయడంతో పాటు ఏజెన్సీ జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న వారికి ఏజెన్సీ అలవెన్సులు ఇవ్వాలని అన్నారు. జిల్లాలో రెండేండ్లుగా కారుణ్య నియామకాలు జరగకపోవడం విచారకరమన్నారు. జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్​ చైర్​ పర్సన్​ కె సీతాలక్ష్మి, ఎంపీపీ బదావత్​ శాంతి, టీఎన్జీవో, టీజీవో నాయకులు అఫ్జల్​ హసన్, సాగర్,  సంగం వెంకటపుల్లయ్య, డి వెంకటేశ్వరరావు, రవి, లింగయ్య పాల్గొన్నారు.

టీఎన్జీవో బిల్డింగ్ ​నిర్మాణానికి శంకుస్థాపన

చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీ గ్రామ పంచాయతీలో టీఎన్జీవో కొత్త ఆఫీస్​ బిల్డింగ్​  నిర్మాణానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజేందర్​  శంకుస్థాపన చేశారు. ఆఫీస్​ బిల్డింగ్​ కోసం స్థలం కేటాయించిన కలెక్టర్​ అనుదీప్​కు  కృతజ్ఞతలు తెలిపారు. చుంచుపల్లి ఎంపీపీ బాదావత్​ శాంతి తదితరులు పాల్గొన్నారు. 

మీటర్ల టార్గెట్​ 100 శాతం

నేలకొండపల్లి, వెలుగు: జిల్లాలో నూరు శాతం ఐఆర్డీఏ స్కానింగ్ మీటర్లను వినియోగదారులకు అందించడం అభినందనీయమని విద్యుత్​ శాఖ ఎస్ఈ  ఏ సురేందర్  అన్నారు. గురువారం నూరు శాతం మీటర్లను బిగించిన ఉద్యోగులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి , కొత్తూరు, చెన్నారం గ్రామాల పరిధిలో నూరు శాతం మీటర్లు పెట్టిన లైన్ ఇన్​స్పెక్టర్​ కుడితొట్టి గోవింద్, రాజేశ్వరపురం సెక్షన్​లో వంద శాతం లక్ష్యాన్ని సాధించిన ఏఈ బాలాజీ కృషి అభినందనీయమన్నారు. ఖమ్మం రూరల్ డీఈ ఎన్  రామారావు, కూసుమంచి ఏడీఈ కోక్యానాయక్  పాల్గొన్నారు.

పర్ణశాల హుండీ ఆదాయం రూ.14.94 లక్షలు

భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని రామాలయం హుండీని గురువారం లెక్కించారు. రూ.14,94,823 నగదు, ఒక యూఎస్​ డాలర్, 100 ఒమన్​ బైసా, ఒక సౌదీ అరేబియన్​ రియాల్, అర కువైట్​ దీనార్​ వచ్చినట్లు ఈవో శివాజీ తెలిపారు. 196 రోజుల ఆదాయాన్ని లెక్కించి బ్యాంకులో జమ చేశారు. లెక్కింపులో ఏఈఓ  శ్రావణ్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ సూచించారు. గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా, మండల స్ధాయి అధికారులతో పాటు పోలీస్​ ఆఫీసర్లు, స్థంబాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ గత ఏడాది ఎదురైన సమస్యలు, అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ సారి మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర మేయర్​ నీరజ, సుడా చైర్మన్​ విజయ్​కుమార్,​ డిప్యూటీ మేయర్​ జోహర, అడిషనల్​ కలెక్టర్లు​స్నేహలత మొగిలి, ఎన్​ మధుసూదన్,  ఏసీపీలు ప్రసన్నకుమార్, రామోజీ రమేశ్​ పాల్గొన్నారు.