
- గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల్లో 75 శాతం పనులు మేమే చేసినం
- మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పనులను కాంగ్రెస్ ఐదేళ్లలో ముప్పావుమందం చేస్తే పదేళ్లలో బీఆర్ఎస్సర్కార్ పావలావంతు కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. ఈ డేటా గురించి తెలియకుండా ఎమ్మెల్యే సతీశ్కుమార్ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లోని కాంగ్రెస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో కరువును పోగొట్టేందుకు కాంగ్రెస్ గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేసిందని గుర్తుచేశారు. ప్రతిసారి ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టు పూర్తయినట్లు హడావుడి చేస్తూ గప్పాలుకొడుతున్నారని మండిపడ్డారు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ డబ్బుల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేశారని ఆరోపించారు. వాళ్ల సొంత ప్రాంతంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసుకున్నా.. ఎన్నో ఏండ్లుగా తాగు, సాగునీటి కోసం అలమటిస్తున్న హుస్నాబాద్ ప్రాంతంపై నిర్లక్ష్యం చేసినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. ఆయన వెంట టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సొసైటీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పార్టీ హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల అధ్యక్షులు బంక చందు, జంగపల్లి ఐలయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, సర్పంచులు జంజీవరెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు.