టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్

హైదరాబాద్ : ఉమ్మడి నల్గొండ రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లాలో చాలామంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులను రాజకీయ సమాధి చేశారని చెప్పారు. ఒకరు కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి పని చేస్తున్నారని, మరొకరు రూ.18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టు బ్రదర్స్ అనే పేరు చిరస్థాయిగా నిలిచేలా మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ బూడిద భిక్షమయ్య గౌడ్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు.

మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. నల్గొండ జిల్లాను లక్ష కోట్లకు బీజేపీకి అమ్ముడుపెడుతారని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను మునుగోడు ఉప ఎన్నిక ద్వారా రాజకీయంగా సమాధి చేయాలని, లేదంటే రాజకీయాలను భ్రష్టు పట్టిస్తారని అన్నారు. రాజకీయాల్లో తనను కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. తన ఓటమికి కూడా వారు ఇద్దరే కారణమన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ను  గెలిపిస్తాన్నారు.

బీజేపీ కుట్రలు : మంత్రి జగదీష్ రెడ్డి 
ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్రం దాటనివ్వకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో మంటలు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏక్ నాథ్ షిండేలు దొరకక బీజేపీ భంగపడిందన్నారు. టీఆర్ఎస్ లో ఎవరూ లేకపోవడంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.20వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి పార్టీలోకి చేర్చుకుందన్నారు. బీజేపీ చర్యలను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు.