
నారాయణ్ ఖేడ్, వెలుగు: సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ నీటిని విడుదల చేయాలని మంగళవారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీబీపేట్, ఖానాపూర్, కృష్ణాపూర్, కల్హేర్ గ్రామాల రైతులు ఈ నీటిపై ఆధారపడే పంటలు పండిస్తున్నారన్నారు.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నీటిని విడుదల చేస్తారేమో అని ఆశతోటి రైతులు వరి, జొన్న పంటలను వేశారని కానీ నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రాజెక్టులో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ నీటిని వదలకుంటే రైతులు నష్టపోతారన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి వారిని ఆదుకోవాలని డీఆర్వో ను కోరారు. ఆయన వెంట జడ్పీటీసీ నరసింహారెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, రైతులు ఉన్నారు.