మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత

  •     కారోబార్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన లీడర్​ 
  •     మాస్ లీడర్ గా ప్రజల్లో గుర్తింపు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ లీడర్​ బిరుదు రాజమల్లు(74)  గుండెపోటుతో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. ఆరోగ్యం మెరుగుపడడంతో ఆదివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్​ అయి హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం హార్ట్ స్ట్రోక్ రావడంతో తుది శ్వాస విడిచాడు. రాజముల్లుకు భార్య సుశీల, నలుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. రాజమల్లు కోడలు బిరుదు సమతాకృష్ణ ప్రస్తుతం సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. 1950 అక్టోబర్ 1న బిరుదు రంగమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించిన రాజమల్లు 1976లో సుల్తానాబాద్ గ్రామపంచాయతీ కారోబార్ గా పనిచేశారు.  ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించిన ఆయన 1981లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

అలాగే సుల్తానాబాద్ ఎల్ఎంబీ బ్యాంక్ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరి 1983లో పెద్దపెల్లి అసెంబ్లీ స్థానానికి పార్టీ టికెట్ ఆశించారు. పొత్తులో భాగంగా సంజయ్ విచార మంచ్ పార్టీకి టికెట్ కేటాయించడంతో రాజమల్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు.1984లో టీడీపీ నుంచి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

1989లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. తిరిగి 1994లో టీడీనీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఎమ్మెల్యేగా రైతు నాగలి గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. బీసీల ప్రతినిధిగా, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన రాజమల్లు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అభ్యర్థి విజయ రమణారావు గెలుపులో కీలక పాత్ర పోషించారు. రాజమల్లు మృతిపై సీఎం రేవంత్​ రెడ్డి, ఎమ్మెల్సీ  జీవన్​ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు.