కరీంనగర్: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త బొడిగె గాలన్న మృతి చెందారు. జనవరి 19వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బొడిగె గాలన్న కన్నుమూశారు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖులు గాలన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన మృతిపై సంతాపం తెలిపారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని, శంకరపట్నం జడ్పీటీసీగా, చొప్పదండి ఎమ్మెల్యేగా పనిచేసిన తన సతీమణి శోభక్కకు అండగా ఉండి పనిచేసారని గుర్తు చేశారు వినోద్.
గాలన్న చిన్నతనం నుంచే పేదప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వామపక్ష పార్టీలలో పని చేశారని, గాలన్న మృతి తీరని లోటన్నారు.
బొడిగె గాలన్న భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామమైన సైదాపూర్ మండలం వెంకటేశ్వర్ల పల్లెకు తరలించారు. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన శోభక్క.. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు.