జడ్చర్ల బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ మధుసూదన్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ నష్టపోవడానికి ప్రధాన కారణమైన బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ ను వెంటనే తప్పించాలని డిమాండ్చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడంతో రాష్ట్రంలో పార్టీ పతనం ప్రారంభమైందని ఆరోపించారు. తిరిగి బండి సంజయ్ ను అధ్యక్షుడిగా నియమిస్తేనే బీజేపీ మళ్లీ రాష్ట్రంలో బతికి బట్ట కడుతుందన్నారు. ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వల్ల పార్టీ బలోపేతం కాదన్నారు.
ఆర్ఎస్ఎస్ భావజాలం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో తాము బీజేపీ పార్టీలో కొనసాగుతున్నామని చెప్పారు సీహెచ్ మధుసూదన్. పార్టీ మారే ఉద్దేశం ఇప్పటికీ తనకు లేదన్నారు. పార్టీ నష్టానికి కారణమైన వారిని తప్పనిసరిగా తప్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక చాలా నియోజకవర్గాల్లో నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు.