- బీడీ కంపెనీలపై వేసిన జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలి
- సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి
కోరుట్ల,వెలుగు : కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదని, బీడీ పరిశ్రమపై వేసిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని సి.ప్రభాకర్ భవన్ లో బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు. బీడీ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభల పాంప్లెట్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీడీ కార్మికుల కనీస వేతన చట్టం అమలు చేసి ఒకే కూలీ చెల్లించాలని, నెలలో 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని ఆవాస్ యోజన ద్వారా అర్హులైన పేద బీడీ కార్మికులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ రూ.వెయ్యి నుంచి రూ. 6000 కు పెంచాలని కోరారు. బీడీ కార్మికుల జీవన భృతిని రూ.4 వేలకు పెంచుతామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. పేద కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కింద రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈనెల30న కోరుట్లలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ, 31న ప్రతినిధుల మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లీడర్లు సుతారి రాములు, గోవర్ధన్, మౌలానా, ముక్రం, ఖాసీం, అనసూయ, శాంత, గోదావరి పాల్గొన్నారు.