హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేతల విచారణ మొదలైంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా నకిరేకల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో పోలీస్ అధికారి తిరుపతన్నతో కలిసి లింగయ్య ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. శనివారం లింగయ్యకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారమే ఆయన హాజరుకావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా రాలేదు. పోలీసుల అనుమతితో గురువారం మధ్యాహ్నం 12 గంటల టైమ్‌లో జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు అటెండ్ అయ్యారు.
ఏసీపీ సహా ముగ్గురు సభ్యుల టీమ్ దాదాపు రెండు గంటల పాటు చిరుమర్తి లింగయ్యను ప్రశ్నించింది. తిరుపతన్నకు ఎంతకాలంగా పరిచయం ఉందనే కోణంలో సిట్ ప్రశ్నించింది. మునుగోడు బై ఎలక్షన్స్ సమయంలో తిరుపతన్న, లింగయ్య మధ్య జరిగిన ఫోన్ కన్వర్జెషన్స్, తేదీ, సమయంతో వివరాలు రాబట్టింది. ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు.
ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని లింగయ్య అన్నట్లు తెలిసింది. ప్రధానంగా గత ఉప ఎన్నికల టైమ్‌లో వేముల వీరేశం(ప్రస్తుతం నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే) అనుచరులు మధన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్ నంబర్లను తిరుపతన్నకు ఎందుకు ఇచ్చావని లింగయ్యను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలక్షన్స్ సమయంలో వీరిద్దరి ఫోన్ నంబర్లు ట్యాపింగ్ జరిగినట్లుగా నిరూపించే ఆధారాలను లింగయ్య ముందు ఉంచినట్లు సమాచారం. ఎన్నికల టైమ్‌లో తిరుపతన్నతో ఏం మాట్లాడారని ఆరా తీసినట్లు తెలిసింది. వీటికి సంబంధించి ఆయన చెప్పిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
తిరుపతన్న అడిగితేనే నంబర్లు ఇచ్చిన: లింగయ్య
ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన. తిరుపతన్నతో మాట్లాడిన కాల్‌లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించిన్రు. వారి దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని భావిస్తున్నాను. వీడియో రికార్డింగ్‌తో పాటు నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన్రు. నాకు తెలిసిన పోలీస్ అధికారి కాబట్టి గతంలో తిరుపతన్నతో మాట్లాడేవాణ్ని.
మునుగోడు బై ఎలక్షన్స్ సమయంలో మదన్‌రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు ఆయన అడిగితే.. నేను ఎన్నికల ప్రచారంలో ఉండడంతో మా అనుచరుల ద్వారా పంపించిన. ఆ తర్వాత నంబర్లు ఎందుకు అని ఆయనను ఫోన్లో అడిగిన. మునుగోడు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను తిరుపతన్న అడిగిండు. ప్రచారం బాగా జరుగుతున్నదని చెప్పిన. వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారనేది అవాస్తవం’’ అని పేర్కొన్నారు.