గద్వాల, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే మాఫియా రాజ్యం వస్తుందని మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇంటిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక సేవ చేయాల్సిన లీడర్లు మాఫియా అవతారం ఎత్తి ప్రజలను దోచుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఇసుక, మట్టి మాఫియా దోపిడీ చేసిందన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు కూడా ఇసుక మాఫియాతో పాటు సీడ్, రియల్ ఎస్టేట్ మాఫియా అవతారం ఎత్తి ప్రజలను దోచుకున్నారని పేర్కొన్నారు.
విలువలు, సిద్ధాంతాల కోసం సొంత అన్నకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన చరిత్ర తమదన్నారు. బీజేపీ తీసుకున్న బీసీ నినాదానికి కట్టుబడి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. అందులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా బోయ వాల్మీకులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. అల్లుడిని గెలిపించేందుకే పోటీ నుంచి తప్పుకున్నారనే ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు. రామాంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, ఎర్ర భీంరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.