బాల్కొండ తెరపైకి..అన్నపూర్ణమ్మ! 

  • బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపే యోచనలో హైకమాండ్
  • మంత్రి ప్రశాంత్​రెడ్డికి ధీటైనా క్యాండిడేట్​గా భావిస్తోన్న పార్టీ

నిజామాబాద్, వెలుగు: మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పేరు తెరమీదకు వచ్చింది. ఆమెను బరిలో నిలపాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ నిర్వహించిన సర్వేలో మంత్రిని ఎదుర్కోగలిగే సత్తా అన్నపూర్ణమ్మకు మాత్రమే ఉన్నట్లు తేలిందని సమాచారం. మల్లికార్జున్​రెడ్డి కూడా తన తల్లిని పోటీకి దింపడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గెలుపు వ్యూహంలో భాగం..  

దివంగత మంత్రి ఏలేటి మహిపాల్​రెడ్డి, అన్నపూర్ణమ్మ దంపతుల రాజకీయ వారసుడిగా వారి కొడుకు డాక్టర్​ఏలేటి మల్లికార్జున్​రెడ్డి పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా బాల్కొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్​సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్​ నుంచి మంత్రి ప్రశాంత్​రెడ్డి పోటీ చేయనుండగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. దీంతో మల్లికార్జన్​రెడ్డికి బదులు ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను పోటీ​ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళకు అవకాశం ఇవ్వడం వల్ల ఓటర్లలోనూ సానుకూలత వస్తోందని, గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం పనికి వస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణమ్మ అనుచరులుగా ఇతర పార్టీల్లో ఉన్న పాత క్యాడర్​ను, పార్టీలోకి  తీసుకురావొచ్చని భావిస్తున్నారు. 

ప్రశాంత్​రెడ్డికి మేనత్త..

మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి తండ్రి దివంగత వేముల సురేందర్​రెడ్డి అన్నపూర్ణమ్మకు సొంత అన్న. అన్నాచెల్లి కుటుంబాల మధ్య మూడు దశాబ్దాలకు మించి రాజకీయ విరోధం ఉంది. పేరుకు బంధుత్వమే గానీ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ వారసత్వం ఇంకా కొనసాగుతోంది. ప్రశాంత్​రెడ్డిపై మేనత్త అన్నపూర్ణమ్మను పోటీకి దింపి, మంత్రికి బ్రేక్​వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. 

జిల్లా రాజకీయాల్లో క్లీన్​ ఇమేజ్..

వివాద రహిత నేతగా జిల్లా రాజకీయాల్లో అన్నపూర్ణమ్మకు పేరుంది. 1985లో ఆర్మూర్​ నుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె భర్త ఏలేటి మహిపాల్​రెడ్డి అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో  హఠాన్మరణం చెందారు. ఆయన వారసురాలిగా పాలిటిక్స్​లోకి ఎంటరైన అన్నపూర్ణమ్మకు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ​ అనుభవం ఉంది. 1994, 2009 ఎన్నికల్లో రెండుసార్లు ఆర్మూర్​ ఎమ్మెల్యేగా పనిచేశారు.  నియోజకవర్గాల పునర్విభజనతో బాల్కొండ నియోజకవర్గానికి మారారు.