ఏనుగు అనుచరుల చేరికతో ఏనుగంత బలం : మదన్​మోహన్

  • ఎల్లారెడ్డిలో సురేందర్ కు డిపాజిట్ గల్లంతు
  • ఎల్లారెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి మదన్ మోహన్

ఎల్లారెడ్డి, వెలుగు: ఏనుగు రవీందర్​రెడ్డి అనుచరులు సైతం కాంగ్రెస్​లో చేరడంతో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​కు ఏనుగంత బలం చేకూరిందని అభ్యర్థి మదన్​మోహన్​ పేర్కొన్నారు. శనివారం ఎల్లారెడ్డి లో ఏర్పాటు చేసిన లింగంపేట్, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానన్నారు. కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటానన్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుందని, ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు డిపాజిట్​కూడా దక్కదన్నారు. తన సొంత పైసలతో ఎల్లారెడ్డి నిరుద్యోగులకు ఉపాధి కోసం జాబ్ మేళా నిర్వహిస్తే ఎమ్మెల్యే సురేందర్ పోలీసులతో ఫేక్ జాబ్ మేళా అని దాడులు చేయించారన్నారు.

బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా అక్కడి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రచారంలో పాల్గొంటానన్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన అనుచరులను మదన్ మోహన్ రావు కంటికి రెప్పల చూసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. చందాలు వేసుకుని గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే సురేందర్ మోసం చేశారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెన్న లక్ష్మణ్, అరీఫ్, ఎల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి మాజీ జడ్పీటీసీ సమేల్ తదితరులు పాల్గొన్నారు.