- పంట భూములు ఎడారిగా మారిపోతాయి
- పాలేరు జలాలు కలుషితం అవుతాయి
మోతె(మునగాల), వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె మండలం రావి పహాడ్ లో ఎన్ఎంకే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నేత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. గురువారం రావిపహాడ్ లో ఫ్యాక్టరీ ముందు అఖిలపక్ష పార్టీల నేతలు ధర్నాకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. ఇథనాల్ఫ్యాక్టరీతో స్థానికంగా 10 కిలోమీటర్ల ప్రాంతమంతా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పచ్చని పంట పొలాల్లో విష వాయువులు నింపే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతుల బోరు బావులు ఎండిపోతాయని, వ్యర్థాలు పాలేరు నదిలో కలిస్తే కలుషితమై పరివాహక ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేసి పర్యావరణాన్ని, ప్రజలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణ చేసే దాకా పనులు బంద్ పెట్టాలని నిలిపివేసేందుకు ప్రయత్నించగా నేతలకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ ధర్నాలో కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ , సీపీఎం, పీవోడబ్ల్యూ , పీడీఎస్ యూ సీపీఐ(ఎంఎల్), టీయూసీఐ నేతలు స్థానిక గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.