అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పోలీసులపై బూతుపురాణం అందుకున్నారు. బుధవారం రాత్రి అచ్చంపేట భ్రమరాంబ ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఉమామహేశ్వర ప్రభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ పూజలు చేస్తున్నారని, ఆయన బయటకు వచ్చాక వెళ్లాలని సూచించారు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గువ్వల ‘నన్నే అడ్డుకుంటారా? మీ అంతు చూస్తా’ అంటూ అచ్చంపేట సీఐ రవీందర్ తో పాటు పోలీసులపై బూతుపురాణం అందుకున్నాడు. అనంతరం ఆలయం ముందు కూర్చొని నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఎమ్మెల్యేగా దురుసు ప్రవర్తనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన తీరు మారకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు