భూకబ్జా కేసులో విచారణకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

భూకబ్జా కేసులో విచారణకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
  • వివరాలు సేకరించిన మోకిల పోలీసులు

హైదరాబాద్ సిటీ/చేవెళ్ల, వెలుగు: భూకబ్జా కేసులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. శంకర్‌‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలోని చైతన్య రిసార్ట్స్‌‌కు సంబంధించిన భూమిని జీవన్ రెడ్డి, ఆయన భార్య రజిత ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయించారని రిసార్ట్స్​యజమాని సామ దామోదర్ రెడ్డి మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

170 ఎకరాల్లో 93 ఎకరాలను  విక్రయించగా.. మిగిలిన భూమి ఆయనదేనంటూ కబ్జా చేశారని ఆరోపించారు. దీంతో మోకిల పోలీస్ స్టేషన్‌‌లో చీటింగ్, దోపిడీ కేసు నమోదు చేశారు. మరో కేసులో చేవెళ్ల మండలం ఈర్లపల్లిలో 20 ఎకరాల భూమిలో ఉన్న ఫంక్షన్ హాల్‌‌ను కూల్చివేసి ఆక్రమించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని జీవన్ రెడ్డి, ఆయన భార్య, తల్లిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌‌లో  కేసు నమోదైంది.

ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం జీవన్ రెడ్డి, అతని భార్య, తల్లి  హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పరిశీలించిన కోర్టు.. ముందస్తు బెయిల్ ఇస్తూ.. వారిని అరెస్ట్ చేయవద్దని ఆర్డర్ జారీ చేసింది. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని కండిషన్ పెట్టింది.