ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ రూ. 6వేలు పెంచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఆగదని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అడివయ్య అధ్యక్షతన మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వికలాంగులు అన్యాయానికి గురయ్యారని అన్నారు.
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి జ్యోతి మాట్లాడుతూ మహిళా దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల తోపాటు వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ వెంకటేశ్, యశోద, స్వామి, బసవరాజ్, దశరథ్, అరిఫా, రాజు, నాగలక్ష్మి, గంగాధర్, నరసింహులు, లింగన్న, కాశప్ప పాల్గొన్నారు.