చౌటుప్పల్: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని భావించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తుఫ్రాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు వార్డు మెంబర్లు, కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తన రాజీనామా తర్వాతే కేసీఆర్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. ఈ క్రుమంలోనే ఎన్నడూ లేనివిధంగా మునుగోడుకు వరాల జల్లు కురిపిస్తున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ బూటకపు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో మునుగోడు ఉప ఎన్నిక జరగనుందన్న రాజగోపాల్ రెడ్డి... భారీ మెజారిటీతో తనను గెలిపించి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని కోరారు.