మునుగోడు/మేళ్లచెరువు, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్ల యూనిట్ల డబ్బులు రూ. 1.58 లక్షలు ఖాతాలో జమ చేసిందని, గెలిచినంక ఆ డబ్బులను వెనక్కి తీసుకుంటూ వారిని మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్గొండ జిల్లా మునుగోడులోని క్యాంపు ఆఫీసు, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మాట్లాడారు. ఎన్నికల ముందు 7,600 మంది గొల్లకుర్మల కుటుంబాల ఓట్ల కోసం ఖాతాలో డబ్బులు జమ చేసి ఫ్రిజ్ చేశారని, నరేంద్ర మోడీ, రాజగోపాల్ రెడ్డి ఆ డబ్బులు ఆపినట్లు తప్పుడు ప్రచారం చేసి దిష్టిబొమ్మలు దహనం చేశారని చెప్పారు. ఎన్నికలు అయిపోయి టీఆర్ఎస్ గెలిచినంక పాత పద్ధతుల్లోనే గొర్లని కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ధర్మయుద్ధం జరగలేదని, డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో అధర్మంగా టీఆర్ఎస్ గెలిచిందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు 15 మంది ఎమ్మెల్సీలు, ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారన్నారు. టీఆర్ఎస్ ప్రలోభాలు, బెదిరింపులతో ప్రజలను మభ్యపెట్టి గెలిచిందన్నారు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని, ప్రాణం ఉన్నంతవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని అన్నారు. దత్తత తీసుకున్న కేటీఆర్ మునుగోడు ప్రజలకు రోడ్లు, ఇండ్లు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. లేదంటే కేటీఆర్, హరీశ్‌రావు, టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు.