రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

  • ప్రజా సమస్యలు విస్మరించారని విమర్శ
  • బీజేపీలో చేరిన కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ లీడర్లు

 

మునుగోడు/చండూరు, (మర్రిగూడ) వెలుగు: మునుగోడులో కూసుకుంట్లే కాదు.. కల్వకుంట్ల వారు పోటీ చేసినా గెలిచేది బీజేపీయే అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్, టీఆర్​ఎస్ లీడర్లు శుక్రవారం పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. మునుగోడులోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వారికి ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్​రెడ్డి మాట్లాడారు. మునుగోడు సమస్యలను పట్టించుకోని టీఆర్​ఎస్​ ప్రభుత్వానికి ఇక్కడ  ఓటు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్​ఎస్​ గద్దెనెక్కి ప్రజా సమస్యలు విస్మరించిందని, కుటుంబ పాలన కొనసాగించడంతో ప్రజలు విసుగు చెందారన్నారు. టీఆర్ఎస్ కు ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని ప్రజలు గుర్తించారని, అందుకే అన్ని పార్టీల నేతలు బీజేపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఇది చూసి టీఆర్ఎస్ కు వణుకు పుట్టిందని, ఆ భయంతోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ  మునుగోడులో దింపారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బొడిగె శోభ, ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, నివేదిత తదితరులు పాల్గొన్నారు. 

2 వేల మంది చేరిక
మునుగోడు మాజీ ఎంపీటీసీ మెంబర్ పందుల భాస్కర్ తో పాటు చండూరు మండలంలోని తాస్కాని గూడెం, నేర్మట, తెరటిల్లి, పడమటితాళ్ల, నాంపల్లి మండలంలోని పెద్దాపురం, మర్రిగూడ మండలంలోని ఎర్రగండ్లపల్లి, అజలాపురం, లెంకలపల్లి, తందారుపల్లి, దామర బీమలపల్లి, వట్టిపల్లి, నారాయణపురం మండలంలోని డాక్ తండా, మునుగోడు మండలంలోని చోల్లేడు, కొరటికల్, ఇప్పర్తి, రామకృష్ణాపురం గ్రామాలకు చెందిన దాదాపు 2వేల మంది వివిధ పార్టీల లీడర్లు, కార్యకర్తలు విడతలవారీగా బీజేపీలో చేరారు.  

బైక్ ర్యాలీతో టీఆర్ఎస్​కు దిమ్మదిరగాలి: వివేక్
9న మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే బైక్ ర్యాలీతో  టీఆర్ఎస్ కు దిమ్మదిరిగే షాక్ ఇవ్వాలని, దీనికోసం కార్యకర్తలు ఇంకా పని చేయాలని మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి సూచించారు. శుక్రవారం మర్రిగూడలోని రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య కార్యకర్తలతో వివేక్​ వెంకటస్వామి మాట్లాడారు. తర్వాత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి లెంకలపల్లి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఇది మునుగోడు ప్రజలకు, కేసీఆర్ ఫ్యామిలీకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్ పాలనను మునుగోడు ప్రజలే తరిమికొట్టాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, మునుగోడు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఎక్కడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్, తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నడు. గతంలో రూ.60వేల కోట్లు ఉన్న అప్పు, టీఆర్ఎస్ అధికారంలోకొచ్చిన తర్వాత రూ.5లక్షల కోట్లకు పెరిగింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన కేసీఆర్, ఏం ఉద్ధరించడానికి జాతీయ పార్టీ పెట్టిండు? ప్రధాని మోడీ ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయిండు. నియోజకవర్గ ప్రజల కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలి”అని వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తుల ఉమ, ప్రదీప్ రావు, యాస సామరేందర్ రెడ్డి, చాపల వెంకన్న, లింగారెడ్డి పాల్గొన్నారు.