చౌటుప్పల్, మునుగోడు, వెలుగు : ఎమ్మెల్యే పదవి అనేది కిరీటం కాదని.. అది ఒక బాధ్యతని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. పట్టణంలోని వలిగొండ క్రాస్ రోడ్డు నుంచి నాగారం రోడ్డు వరకు రూ.9.95 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని చిన్నకొండూరు రోడ్డులో అమృత్ పథకంలో భాగంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుటకు రూ.21 కోట్లతో నిర్మాణ పనులను ప్రారంభించారు. స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని బీసీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
అనంతరం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 18.30 లక్షల లీటర్ల నుంచి 24 లక్షల లీటర్లకు తాగునీరు పెంచుతామన్నారు. భవిష్యత్లో ప్రతి ఇంటికీ పైపులైన్ ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ పట్టణానికి ఏమాత్రం తీసిపోకుండా చౌటుప్పల్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరనాయక్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.