నల్గొండ, వెలుగు : కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో తనపై పోటీ చేసి గెలవాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని గూడపూర్, కొరటికల్, చీకటిమామిడి, కొంపెల్లి, మునుగోడులో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కొరటికల్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా సీఎం కేసీఆర్ వివక్ష చూపారని, ఆయనకు కనువిప్పు కలగాలనే తాను రాజీనామా చేశానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ తప్ప ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వస్తే తనకు కూడా మంత్రి పదవి ఇస్తానని ఆశ చూపారన్నారు. మరో 18 నెలలు పదవీ కాలం ఉన్నా నియోజకవర్గ బాగు కోసం తాను రాజీనామా చేశానని, దీంతో కేసీఆర్ ఫామ్‌హౌజ్ నుంచి మునుగోడుకు వచ్చాడని, 10 లక్షల మందికి పెన్షన్, చేనేత బీమా అమలు చేస్తున్నాడన్నారు. టీఆర్‌ఎస్‌లోకి పోయిన సర్పంచ్‌లు అక్కడ ఇమడలేక తనతో వచ్చేందుకు రెడీగా ఉన్నారన్నారు. అనంతరం బీజేపీలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, నాయకులు వేంరెడ్డి సురేందర్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
పోషకాహారంపై అవగాహన కల్పించాలి
సూర్యాపేట, వెలుగు : పోషకాహారంపై గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. పోషణ మాసం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేటలోని గాంధీ పార్క్ నుంచి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోషణలోప రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం చేపట్టాలన్నారు. చిన్నారుల ఎత్తు, బరువుల కొలతలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాలీలో సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి పద్మ, డీఆర్డీవో కిరణ్‌కుమార్, సీడీపీవోలు రూప, సాయిగీత, సూపరింటెండెంట్ హుస్సేనా, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్ పాల్గొన్నారు.
శోభాయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలి
సూర్యాపేటలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు, శోభాయాత్ర నిర్వహించే మార్గాలను గురువారం కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జన టైంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రేన్‌లు, గజ ఈతగాళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. వారి వెంట ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్పీ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
‘ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పట్టించుకుంటలేరు’
యాదాద్రి/తుంగతుర్తి, వెలుగు : రోడ్డుపై గుంతలు పడి వాన నీళ్లు నిలుస్తుంటే ప్రజలు ఎట్లా నడుస్తరని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్రకు మద్దతుగా గురువారం యాదాద్రి జిల్లా వడపర్తి నుంచి భువనగిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దత్తత తీసుకున్న వడపర్తికి నిధులు రాకుండా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జోడో యాత్రను సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, ఆలేరు ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, తంగెళ్లపల్లి రవికుమార్, సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా నాగారం నుంచి ఫణిగిరి వరకు నిర్వహించిన ర్యాలీలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొన్నారు. ఫణిగిరి స్టేజీకి చేరుకున్నాక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ముగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, నాగారం మండల అధ్యక్షులు తొడుసు లింగయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్మకంటి సోమయ్య పాల్గొన్నారు. అలాగే రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర సక్సెస్ కావాలంటూ హుజూర్‌నగర్‌కు చెందిన ఐఎన్‌టీయూసీ నాయకులు గోపాలపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
నష్టపోయిన రైతులకు రూ. 5 లక్షలు ఇవ్వాలి
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ సమీపంలో సాగర్ ఎడమకాల్వకు గండి పడి పంట నష్టపోయిన రైతులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గండిపడిన ప్రదేశాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాసిరకంగా పనులు చేయడం వల్ల కాల్వకు గండి పడిందని ఆరోపించారు. పంట నీట మునగడంతో పాటు, పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, వాటిని తొలగించేందుకు రైతులు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు కంకణాల నివేదితారెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
22 గేట్ల ద్వారా నీటి విడుదల
హాలియా, వెలుగు : నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో 22 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4,24,428 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 14 గేట్లను10 ఫీట్లు, 8 గేట్లను 15 ఫీట్ల మేర ఎత్తి 3,79,706 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589 అడుగుల నీరు నిల్వ ఉంది. కుడికాల్వకు 9,833 క్యూసెక్కులు, ఎస్ఎల్‌బీసీకి 1,800, మెయిన్ పవర్ హౌజ్‌కు 33,089 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
పులిచింతలకు పెరిగిన వరద
మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ నుంచి 3.61 లక్షల వరద వస్తుండడంతో 15 గేట్లను మూడున్నర మీటర్ల మేర ఎత్తి 3.73 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 37.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గిరిజన సంప్రదాయానికి ప్రతీక ‘తీజ్’
దేవరకొండ, వెలుగు : తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీలో గురువారం జరిగిన తీజ్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. గిరిజన బాలికల చదువు కోసం ప్రభుత్వం అనేక గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం స్వచ్ఛ గురుకులం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, టీఆర్‌ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, ప్రిన్సిపాల్ శ్యామల, వైస్ ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి, శ్రీరాం, ప్రసన్న పాల్గొన్నారు.