పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అంకిరెడ్డిగూడెం వద్ద బండి సంజయ్ ను కలిశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేయాలని బండి సంజయ్ ను అడిగేందుకు వచ్చానని V6 న్యూస్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈనెల 21న అమిత్ షాతో నిర్వహించే మీటింగ్ ఏర్పాట్లపైనా చర్చించానని చెప్పారు. రాష్టంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా మునుగోడు నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయానని, తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేసి, ప్రజల కనీస అవసరాలను తీర్చానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను నిజాయితీగా పని చేస్తున్నందున మునుగోడు నియోజకవర్గం ప్రజలు తన వెంటే ఉన్నారని అన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై చేసిన కామెంట్స్ పై కూడా స్పందించారు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసే ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్ని పార్టీలు మారాడో గుర్తుకు తెచ్చుకోవాలని సెటైర్ వేశారు. పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయకుండానే గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. తన నిజాయితీ, నిబద్ధతను శంకించే స్థాయి సుఖేందర్ రెడ్డికి లేదన్నారు.