- హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి
మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, అడ్వకేట్ కొమిరెడ్డి జ్యోతక్క అంత్యక్రియలు రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు తరలిరాగా అశ్రునయనాల మధ్య ఆదివారం సాయంత్రం ముగిశాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరులో శుక్రవారం రాత్రి జ్యోతక్క మరణించిన సంగతి తెలిసిందే. ఆమెను కడసారి చూసేందుకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
ఆమె పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. అంతిమయాత్ర మెట్‌పల్లిలోని ఆమె ఇంటి నుంచి బయలుదేరి కొత్త బస్టాండ్ మీదుగా వెంకటరావుపేట వరకు కొనసాగింది. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే మెట్ పల్లికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కొమిరెడ్డి జ్యోతక్క అన్నారు. రాజకీయాలు, ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఆమె చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. హైకోర్టు జడ్జి వేణుగోపాల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ప్రముఖులు విద్యాసాగర్‌రావు, సురేశ్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు, సుజిత్ రావు తదితరులు అంత్యక్రియలో పాల్గొన్నారు.