జనగామ, వెలుగు: సీఎంపై ఇష్టమొచ్చనట్లు మాట్లాడితే సహించేది లేదని, బీఆర్ఎస్ నేతలు రేవంత్‌రెడ్డి కాలిగోటికి కూడా సరిపోరని జనగామ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం జనగామ కాంగ్రెస్‌పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన కేసీఆర్ఫ్యామిలీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్న సీఎం పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు.
అహంకారంతో మాజీ మంత్రి కేటీఆర్లొట్టపీసు సీఎం అని అంటున్నాడని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్లే లొట్టపీసని అన్నారు. వన్ ప్లస్ సిక్స్అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. ఇది కేసీఆర్ కే వర్తిస్తుందని, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎం అయితే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు, కవిత, ఆఖరుకు హిమాన్షు కూడా పెత్తనం చెలాయించి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం నాలుగు గ్రామాలను ముంచి పాపాలను మూటగట్టుకున్న కేసీఆర్ ఫ్యామిలీ త్వరలోనే రోడ్డున పడుతుందని, జనం రాళ్లతో కొట్టే రోజు వస్తుందన్నారు. పదేండ్లలో లక్షల కోట్లు దోచుకున్నారని, 2014 నుంచి 2023 వరకు సమగ్ర విచారణ జరిపి ఊచలు లెక్కబెట్టేలా చేయాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్‌కు హోదా ఎందుకన్నారు. ప్రతిపక్ష నేత పదవి ఇంకొకరికి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. పేదల పక్షాన నిలుస్తూ ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ లీడర్లు విమర్శలు చేసే ముందు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, బడికె ఇందిర తదితరులు పాల్గొన్నారు.