ఆసిఫాబాద్/ కాగజ్‌నగర్, వెలుగు : దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం బీజేపీ నైజమైతే, పేదల కోసం నిస్వార్థంగా పని చేయడం గాంధీ కుటుంబ లక్షణమని మంత్రి సీతక్క చెప్పారు. బీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాగజ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ చెబుతున్న కుటుంబ పాలన కేసీఆర్ ఫ్యామిలీకి సరిపోతుందని, రాజీవ్‌గాంధీ మరణం తర్వాత 35 ఏండ్లుగా పదవి లేకుండా ఉన్న సోనియా, రాహుల్‌కు కాదన్నారు. అధికారం నెత్తికెక్కిన బీఆర్‌ఎస్ ఇప్పుడు మూలకు పడిపోయిందన్నారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలను అమలుచేస్తున్నారని చెప్పారు. పోడు భూముల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, ఆసిఫాబాద్, సిర్పూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జులు అజ్మీర శ్యాంనాయక్, రావి శ్రీనివాస్ పాల్గొన్నారు.