
హైదరాబాద్, వెలుగు: బియ్యం అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ పై వర్ని, కోటగిరి ఠాణాల్లో నమోదైన కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ ఎస్పీకి శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. పౌరసరఫరాల శాఖ షకీల్ కుటుంబానికి చెందిన మిల్లులకు 50,732 టన్నుల ధాన్యాన్ని సరఫరా చేయగా, 33 వేల టన్నులకు పైగా దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఇటీవల నిజామాబాద్‌లోని షకీల్‌కు చెందిన మూడు మిల్లుల్లో పోలీసులు, పౌరసరఫరా శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా. రూ.70 కోట్ల విలువైన బియ్యం కనిపించకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు రెండు పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదు చేశారు.