కల్వకుంట్ల ఫ్యామిలీని బొందపెట్టడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు

కల్వకుంట్ల ఫ్యామిలీని బొందపెట్టడం ఖాయం : మైనంపల్లి హన్మంతరావు
  •     అధికారం కోల్పోగానే నిద్రపట్టక విమర్శలు
  •     ఎప్పటికైనా 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకే
  •     మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

సిద్దిపేట, వెలుగు : తెలంగాణ ఉద్యమం పేరిట కేసీఆర్​ఫ్యామిలీ పదేండ్ల పాటు పవర్​ని ఎంజాయ్​ చేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే జీర్ణించుకోలేక కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విమర్శించారు. మంగళవారం ఆయన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెట్టడం ఖాయమని  అది జరిగేంత వరకు తాను నిద్రపోనన్నారు. చెంచాలను పెట్టుకుని  ఒక బచ్చాలా మాట్లాడుతున్న కేటీఆర్ సిరిసిల్ల లో ఎలా గెలిచాడో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  

కేకే మహేందర్ రెడ్డి కట్టిన కోటలో పాములా దూరిన వ్యక్తి సీఎంను విమర్శించే హక్కులేదని, గొప్పలు మాట్లాడుతున్న కేటీఆర్ కరీంనగర్ ఉప ఎన్నికల్లో సిరిసిల్లలో మెజార్టీ తగ్గిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ గౌరవం ఇవ్వని వారు అధికారం కోల్పోగానే హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో కూల్చుతామని మాట్లాడడం వారి ఫ్రస్టేషన్ కు నిదర్శనమన్నారు. పదేండ్లు పాటు రాష్ట్రాన్ని దోచితే సీఎం రేవంత్ ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే తట్టుకోలేరని హెచ్చరించారు.

 సిద్దిపేట కార్యకర్తలపై ఈగ వాలకుండా చూసుకుంటానని స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందిపెడితే అతడి ఇంటి పైకి దాడి చేయడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. రాబోయే ఐదేండ్లలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని హరీశ్​రావు బీజేపీలో చేరడం ఖాయమన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో  కాంగ్రెస్ కు మరిన్ని ఓట్లు లభించేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని డిస్ట్రబ్ చేయవద్దనే ఉద్దేశంతో ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకోవడం లేదని

అయినప్పటికీ 26 మంది బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కలవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి చెప్పు దెబ్బలు తప్పవని, డబ్బులతో రాజకీయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వారానికి రెండు సార్లు సిద్దిపేటకు వస్తానని, అవసరమైతే ఇక్కడే ఆఫీస్ ను ఏర్పాటు చేసి హరీశ్​ రావు సంగతి తేలుస్తానన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు,  డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి

నిర్మాత బండ్ల గణేశ్,​  సిద్దిపేట  కాంగ్రెస్ ఇన్​చార్జి  పూజల హరికృష్ణ మాట్లాడారు. అంతకు ముందు సిద్దిపేట పట్టణంలో దాదాపు గంటకు పైగా మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కూడళ్ల లో భారీ పూల దండలతో కార్యకర్తలు స్వాగతం పలికారు. రెండు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి మైనంపల్లి హన్మంతరావు నివాళులు అర్పించారు.