రైతులపై వివక్ష చూపుతున్న సర్కారు : పద్మావతి రెడ్డి

మునగాల, వెలుగు: బీఆర్ఎస్‌ సర్కారు రైతులపై వివక్ష చూపుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి ఆరోపించారు.  సాగర్‌‌ ఎడమ కాల్వకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మునగాలలోని హెడ్ రెగ్యులేటర్ వద్ద కిసాన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌‌లో 480 అడుగులు నీళ్లు ఉన్నా.. నీళ్లు విడుదల చేశామని గుర్తుచేశారు.  ఇప్పుడు 520 అడుగులు ఉన్నా నీళ్లు ఇవ్వకపోవడంతో ఆయకట్టు కింద రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లు కూడా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని, లేదంటే  ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎడమ కాల్వ కమిటీ మాజీ చైర్మన్ సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్‌, కిసాన్ సెల్ నేతలు అశోక్, లిక్కి రామరాజు, వంగవీటి రామారావు, కే జైపాల్ రెడ్డి, బుచ్చి పాపయ్య, రామరాజు, బక్క వెంకటేశ్వర్లు,  రమేశ్ రాజు, కాసర్ల కోటేశ్వరరావు, కాలే సామెల్, ఎంపీటీసీలు శ్రీనివాసరెడ్డి, జై వెంకటేశ్వర్లు బాగ్దాద్, బసవయ్య, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.