హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి జరిగిన ఘటన స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లిలో జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చర్లపల్లి జైలు నుండి 2024, నవంబర్ 14వ తేదీన ఒక లేఖ విడుదల చేశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు నా పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ పూర్తిగా తప్పని లేఖలో పేర్కొన్నారు.
కేటీఆర్ గురించి కానీ, కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు నా నుండి తీసుకోలేదని.. నేనేం పోలీసులకు చెప్పలేదని అన్నారు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు తెల్ల పేపర్లలపై సంతకం తీసుకున్నారని.. అరెస్ట్ ముందు కూడా నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. వాకింగ్ చేస్తుంటే అదుపులోకి తీసుకుని బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ తీసుకువచ్చారని పట్నం లేఖలో వెల్లడించారు.
కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో దాడులు చేశామని నేను ఒప్పుకున్నట్లు పోలీసులు కట్టు కథ అల్లారని అన్నారు. పోలీసులకు నేను ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని.. నా రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవి నిజం కాదని పేర్కొన్నారు. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని.. అప్పటివరకు అందులో ఏముందో నాకు తెలియదన్నారు. కాగా, లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్న విషయం తెలిసిందే.
కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతో లగచర్లలో అధికారులపై దాడి చేశామని పట్నం నరేందర్ రెడ్డి నేరం ఒప్పుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. ఈ క్రమంలో పోలీసుల రిమాండ్ రిపోర్టుకు కౌంటర్‌గా పట్నం నరేందర్ రెడ్డి జైలు నుండి లేఖ విడుదల చేశారు. పట్నం రిమాండ్ రిపోర్టులో పోలీసులు కేటీఆర్ పేరును ప్రస్తావించడం.. అదంతా ఉట్టిదేనని పట్నం లేఖ విడుదల చేయడం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది.