- భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. శేఖర్ రెడ్డి చేసిన వంద ఎకరాల వెంచర్లో అసైన్డ్ ల్యాండ్ కూడా ఉందన్నారు. దీనిపై విచారణ చేయిస్తామని తెలిపారు. ఆదివారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నయీం కబ్జాలకు పాల్పడ్డారని, ఇప్పుడు అతడి ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరడానికి పైళ్ల శేఖర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నా.. తాను అడ్డుకోవడం వల్ల బీఆర్ఎస్లోనే ఉండిపోయారని తెలిపారు.
ప్రజాభిమానం పొందిన సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌ను తప్పపట్టారు. స్థాయిని మరిచి మాట్లాడడం సరికాదన్నారు. ఇలాంటి కామెంట్స్ చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని చెప్పారు. కేవలం కేసీఆర్ పట్ల భక్తిని చాటుకోవడానికే సీఎం రేవంత్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇకనైనా బీఆర్ఎస్ లీడర్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. అంతకుముందు ముగ్గుల పోటీలను పరిశీలించారు. ఆయన వెంట తంగళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్ ఉన్నారు.