
మానకొండూర్, వెలుగు: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. బుధవారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగంపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే తన అనుచరులతో దాడులు చేయిస్తున్నారని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.
నియోజకవర్గం చుట్టూ రిజర్వాయర్లున్నా ఎమ్మెల్యే అసమర్థత వల్ల సాగునీరందడం లేదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మండల కేంద్రంలోని జీపీ ఆఫీస్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్‌ఎస్ లీడర్లు ప్రయత్నించగా.. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సిబ్బంది అడ్డుకున్నారు.