బీఆర్‌‌ఎస్‌‌ను గెలిపిస్తే ప్రజలను దేవుడూ రక్షించలేడు : రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి

నర్సంపేట, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ మాటలతో మోసపోయి మళ్లీ బీఆర్‌‌ఎస్‌‌కు అధికారం ఇస్తే ప్రజలను ఆ దేవుడు కూడా రక్షించలేడని బీజేపీ స్టేట్‌‌ లీడర్‌‌, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి అన్నారు. 2014, 2018 ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. నర్సంపేటలోని ఐఎంఏ హాల్‌‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.

డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌‌ ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి ఆరి తేరారని అన్నారు.

ALSO READ: మానుకోట కలెక్టరేట్‌‌లో కంట్రోల్‌‌ రూమ్‌‌ : శశాంక

ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డితో పాటు గతంలో తాను, దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేలుగా చేశామని, ముగ్గురిలో ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. సమావేశంలో జాటోతు సంతోష్‌నాయక్‌‌, వడ్డేపల్లి నర్సింహారావు, బాల్నె జగన్‌‌, జూలూరి మనీశ్‌‌, గూడూరు సందీప్, సుదర్శన్, శ్రీనివాస్, కంభంపాటి ప్రతాప్‌‌ పాల్గొన్నారు.