మాజీ ఎమ్మెల్యే సుధాకర్​ రావు కన్నుమూత

తొర్రూరు, వెలుగు: వరంగల్​జిల్లా పాత చెన్నూరు(పాలకుర్తి ) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, డాక్టర్​ నేమురుగొమ్ముల  సుధాకర్ రావు  కన్నుమూశారు. అనారోగ్య సమస్యతో  ఇటీవల సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేరిన ఆయన ట్రీట్మెంట్ పొందుతూ  బుధవారం తుదిశ్వాస విడిచారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డకోత్తపెల్లి గ్రామానికి చెందిన సుధాకర్​రావు1999లో చెన్నూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. సుధాకర్ రావు 2014 ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిలో ఓడిపోయారు. 

2023 ఎన్నికల ముందు వరకు సుధాకర్ రావు ఆరోగ్యశ్రీ ట్రస్ట్  చైర్మన్ పోస్ట్ లో కొనసాగారు. సుధాకర్ రావు మృతి పట్ల బీఆర్‌‌ఎస్‌  చీఫ్, మాజీ సీఎం కేసీఆర్  విచారం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. డాక్టర్‌‌గా, ప్రజాప్రతినిధిగా సుధాకర్‌‌ చేసిన సేవలను కేసీఆర్ కొనియాడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు యశోద హాస్పిటల్ కు చేరుకొని సుధాకర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక మంచి డాక్టర్ ను, రాజకీయ నాయకుని కోల్పోవడం నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటన్నారు. సుధాకర్ రావు మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఫ్యామిలీకి సానుభూతి తెలియజేశారు.