- కండువా కప్పని కేసీఆర్
- పార్టీలో ఉన్నట్టేనని స్పష్టం
జనగామ, వెలుగు : స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అటూ ఇటూ తిరిగి చివరకు గులాబీ గూటికే చేరారు. రెండు నెలల క్రితం ఆత్మాభిమానం చంపుకోలేక అంటూ కేసీఆర్, ఇతర లీడర్లపైవిరుచుకుపడిన ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. మళ్లీ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో కేసీఆర్ చెంతకే చేరారు. ఆదివారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ కాగా రాజయ్యకు కనీసం పార్టీ కండువా కూడా కప్పలేదు. అప్పటి రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి పార్టీలో ఉన్నట్లే అని కేసీఆర్ చెప్పారు.
అలాగే స్టేషన్ ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ బాధ్యతలను రాజయ్యకు అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించుకోవాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దీంతో ముభావంగానే రాజయ్య తలూపి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్రాకపోవడంతో నిరాశ చెందారు. కాంగ్రెస్‌లో చేరి వరంగల్ఎంపీ అవుదామని ఆశించారు.
కానీ, కాంగ్రెస్ నుంచి ఎటువంటి హామీ తీసుకోకముందే గులాబీ గూటికి గుడ్ బై చెప్పారు. పలుమార్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులను కలిసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో రాజయ్య చిరకాల ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి కూతురు కావ్యకు పిలిచి మరీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఈ పరిణామాలు రాజయ్యకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్టు తిరిగి గులాబీ గూటికి చేరి ఎంపీ టికెట్ తెచ్చుకుందామని అనుకుంటే అధినేత కేసీఆర్ ...సుధీర్‌కుమార్‌కు కన్ఫం చేసి రాజయ్య ఆశలపై నీళ్లు చల్లారు.
రెండు రోజుల క్రితం అభ్యర్థిత్వం ఫైనల్ చేసే క్రమంలో రాజయ్య ఎర్రవల్లి ఫాంహౌస్‌కు దగ్గరలో వేచి చూసి..చూసీ నిరాశతో వెనుదిరిగారు. దారులన్నీ మూసుకుపోవడంతో చేసేదేమీ లేక ఆదివారం ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అక్కడ అనుకున్న స్థాయిలో ఆయనకు రిసీవింగ్ లేకపోవడంతో డల్‌గా కనిపించారు. ఇదిలా ఉంటే పోయినోళ్లను కాళ్లు మొక్కినా పార్టీలోకి తిరిగి తీసుకునేదే లేదన్న కేటీఆర్ ఇప్పుడు ఏమంటారనే చర్చ మొదలైంది.