కాంగ్రెస్ వైపు  చూస్తున్న నేతలు.. 

కాంగ్రెస్ వైపు  చూస్తున్న నేతలు.. 

నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న తనను కాదని.. కాంగ్రెస్​నుంచి వచ్చిన చిరుమర్తి లింగయ్యకు టికెట్​ఇచ్చారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న వేముల.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. తన అనుచరులతో కలిసి మూకుమ్మడిగా పార్టీని వీడుతున్నట్టు తేల్చిచెప్పారు. ‘‘వేముల వీరేశం ఏం చేశాడని నాలుగేండ్లుగా హింసిస్తున్నారు.

ఉద్యమకాలంలో దెబ్బలు తిని జైలుకు పోయింది నేను కాదా.. బీఆర్ఎస్​కార్యకర్తలను పోలీసులతో కొట్టించినా పార్టీ జిల్లా నాయకత్వం పట్టించుకోలేదు. గన్​మెన్​లను తొలగించారు. ఇన్ని బాధలు పెట్టినా భరించాను. ఇంకా భరిస్తూ పార్టీలోనే ఉండాలా?” అని తన అనుచరుల ముందు వాపోయారు. ‘‘ఈ రోజు నుంచి బీఆర్ఎస్​తో ఉన్న బంధం తెగిపోయింది. రాజీనామా లేఖను పార్టీ నాయకత్వానికి పంపుతాను. ఏ పార్టీలో చేరేది వారం రోజుల్లోనే వెల్లడిస్తాను” అని చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖరారైందని సమాచారం. ఇక కరీంనగర్​కు చెందిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కూడా బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు.

వచ్చే ఎన్నికల్లో కరీంనగర్​అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కొత్త జైపాల్​రెడ్డి బీఆర్ఎస్ లో చేరతారని ఇన్నాళ్లు ప్రచారం జరగ్గా, ఆయన కాంగ్రెస్​లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు పటాన్​చెరు టికెట్​ఆశించిన నీలం మధు భారీ బల ప్రదర్శన చేశారు. కాంగ్రెస్​లో చేరి పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్​లో ఒక్క ముదిరాజ్​నాయకుడికి కూడా టికెట్​ఇవ్వలేదనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.