నకిరేకల్ కాంగ్రెస్​లో వీరేశం రచ్చ!

  • ఆయనకు టికెట్ ఇస్తే  మాదారి మేం చూసుకుంటం  
  • ఆశావహులు ఏకమై హైకమాండ్‌కు అల్టిమేటం
  • ఓటరు మ్యాపింగ్‌ మీటింగ్‌లో  గందరగోళం

నల్గొండ, వెలుగు : నకిరేకల్​ కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రచ్చ నడుస్తోంది. ఆయన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో మొన్నటి వరకు ఎమ్మెల్యే టికెట్​ కోసం కొట్లాడిన ఆశావహులంతా ఏకతాటిపైకి వచ్చారు. వీరేశానికి టికెట్‌ ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని హైకమాండ్‌కు అల్టిమేటం విధించారు. ఈ మేరకు గురువారం నకిరేకల్‌లో భువనగిరి పార్లమెంట్​ఇన్​చార్జి, కర్నాటక ఎమ్మెల్యే మానె శ్రీనివాస్​ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. వీరేశం తప్ప ఆశావహుల్లో ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యే టికెట్​కోసం నకిరేకల్​ నుంచి  మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, పీసీసీ నేతలు కొండేటి మల్లయ్య, దైదారవీందర్​, ప్రసన్నరాజ్, వేదాసు శ్రీధర్​తో సహా 18 మంది దరఖాస్తు చేశారు. వీరిలో మల్లయ్య జానారెడ్డి అనుచరుడు కాగా, దైదా రవీందర్​, ప్రస న్నరాజ్​, వేదాసు శ్రీధర్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోటరీలో ఉన్నారు. మొన్నటి వరకు కొండేటి మల్లయ్య టికెట్​ఇవ్వొద్దని ఎంపీ కోమటిరెడ్డి వర్గం వాదించింది. నార్కట్​పల్లి మండలం బ్రహ్మణ వెల్లంలలో జరిగిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే ఇ ప్పుడు వీరేశం పార్టీలోకి వస్తున్నాడని, టికెట్​ కూడా కన్ఫాం అయ్యిందని పార్టీ హైకమాండ్​నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూ పు రాజకీయాలకు స్వస్తి చెప్పి వీరేశం ఎంట్రీని అడ్డుకునేందుకు ఒక్కటవుతున్నట్లు తెలుస్తోంది.

సర్వేలతోనే అభ్యర్థి ఎంపిక..

కాంగ్రెస్​ అభ్యర్థి ఎంపిక సర్వేలతోనే ఫైనల్​చేస్తామని హైకమాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారు, సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతల పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తోంది. బీఆర్​ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు దీటైన అభ్యర్థి ఎవరనే దానిపై వివిధ రకాల పేర్లతో పార్టీ సర్వేలు చేయిస్తోంది. దీంట్లో వీ రేశంతో సహా, ఆశావహులు పేర్లు కూడా ఉన్నాయి. 

అయితే బీఆర్ఎస్​ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, పార్టీ పరంగా వీరేశానికి జరిగిన నష్టంపై  కేడర్‌‌లో సానుభూతి వ్యక్తమవుతోందని సర్వేల్లో తెలినట్లు సమాచారం.  దీన్ని అవకాశంగా తీసుకున్న వీరేశం కాంగ్రెస్​లో చేరేందుకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సహకారం కోరినట్లు ప్రచారం జరిగింది. జిల్లా కాంగ్రెస్​ సీనియర్లతో శ్రీనివాస్​ రెడ్డి జరిపిన చర్చలు సఫలం కావడంతో వీరేశం రాకకు లైన్​ క్లియర్ అయిందని, త్వరలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని లీక్​లు ఇవ్వడం మొదలు పెట్టారు. 

పార్టీ నుంచి వెళ్లిపోతాం..

ఇన్నాళ్లు కష్టపడ్డ తమను కాదని బయటి నుంచి వచ్చే లీడర్లకు టికెట్​ ఇస్తే పార్టీ నుంచి వెళ్లిపోతామని ఆశావహులు అల్టిమేటం ఇచ్చారు. మానె శ్రీనివాస్​పెట్టిన మీటింగ్​ఏజెండా గ్రామాల్లో ఓటరు మ్యాపింగ్​ కోసం కాగా, అది కాస్తా ఆశావహుల గొడవతో సైడ్​ ట్రాక్​ పట్టింది. దాదాపు 300 మందికి పైగా పార్టీ ముఖ్యనాయకులు సమావేశానికి హాజరయ్యారు. దీంట్లో మెజార్టీ సభ్యులు వీరేశంకు టికెట్​ ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఆనాడు వీరేశానికి వ్యతిరేకంగా పార్టీకి కట్టుబడి చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం పనిచేశామని స్పష్టం చేశారు.

కానీ, ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని, ఇప్పుడు వీరేశానికి టికెట్​ ఇస్తే ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం పార్టీలోకి రావాలనుకోవడం సరైన విధానం కాదని, అదే జరిగితే తామంతా తలోదారి చూసుకోక తప్పదని హెచ్చరించారు.