తగ్గేదేలే..! బీఆర్‌‌ఎస్‌లో వెనక్కి తగ్గని ఆశావహులు

  • నేడు, రేపు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు
  • కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
  • కోదాడ, మునుగోడు, నాగార్జునసాగర్​, నల్గొండలో ఆగని అసంతృప్త జ్వాలలు 


నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్‌లో ఆశావహులు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడంతో తమదారి తాము చూసుకునేందుకు సిద్ధమయ్యారు.  ఇందులోభాగంగా అనుచరులతో కలిసి నియోజకవర్గాల్లో ఆత్మీయ సవేశాలకు ప్లాన్ చేశారు.   మంగళవారం నాగార్జునసాగర్​, దేవరకొండ, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం భేటీ అయ్యింది.  నకిరేకల్​, కో దాడ, నల్గొండ, మునుగోడులో ఆశావహులు, అసంతృప్తులు ఒకట్రెండు రోజుల్లో పెద్ద ఎత్తున మీటింగ్‌ పెట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది.
 
ఆశావహుల దారెటు...?

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన వాళ్లు కొందరైతే,  ఎమ్మెల్యేల వైఖరి నచ్చక తిరుగుబాటు జెండా ఎగరవేసిన వాళ్లు కొందరు ఉన్నారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్​, కోదాడ, మునుగోడు అభ్యర్థుల మార్పు కచ్చితంగా ఉండొచ్చని  భావించారు. కానీ పార్టీ హైకమాండ్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంతో అందరూ నారాజ్​అయ్యారు.  ముఖ్యంగా నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి మో త్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​ (ఆలే రు), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు అమిత్​ రెడ్డి,

కర్నాటి విద్యాసాగర్​ (మునుగోడు), అల్లు అర్జున్​ మామ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్​ (సాగర్), పిల్లి రామరాజు యాదవ్, చాడ కిషన్​ రెడ్డి (నల్గొండ), కన్మంత శశిధర్​ రెడ్డి (కోదాడ) తదితరులు ఎమ్మెల్యే టికెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నించినా.. నిరాశ తప్పలేదు.

సాగర్, దేవరకొండలో అసంతృప్తుల సమావేశాలు 

సాగర్‌‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్​కు టికెట్​ఇవ్వడంపై ఆయన సామాజిక వర్గానికే చెందిన లోకల్​లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్​ నేత కడారి అంజయ్యకు పార్టీలో సముచిత స్థానం క ల్పిస్తామని ఉపఎన్నికల సభలో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు  అంజయ్యకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు.  మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్​ మనవడు మన్నెం రంజిత్​ యాదవ్​ కూడా టికెట్​ఆశించారు.

కానీ, హైకమాండ్ భగత్‌వైపే మొగ్గు చూపడంతో యాదవ సామాజిక వర్గం లీడర్లు, ఇంకొంత మంది పార్టీ నేతలు అంజయ్య ఆధ్వర్యంలో  మంగళవారం హాలియాలో సమావేశం అయ్యారు.  పార్టీ  నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెపుతున్న కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి కూడా ఆయన అనుచరులతో మీటింగ్ పెట్టారు. దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్‌ యాదవ్, మున్సిపల్​ చైర్మన్​ ఆలంపల్లి నర్సింహ్మ, మాజీ చైర్మన్ దేవేందర్‌‌ నాయక్‌ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.  

నేడు నకిరేకల్‌లో వీరేశం మీటింగ్

మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్​ హాల్‌లోలో ఆత్మీయ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని వీరేశం అనుచరులు, బీఆర్​ఎస్ లీడర్లు అందరినీ ఆహ్వానించారు. వాళ్ల అందరితో చర్చించి  తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.  ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సపోర్ట్​తో కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వీరేశం రాకకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో చేరేందుకు వీరేశం వర్గం కూడా సిద్ధమైంది. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్​ ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్​ వేస్తానని చెపుతున్నారు. బీసీలు ఎవరూ ముందురాక నల్గొండ ఆగమైందని, దాన్ని తిప్పికొట్టేందుకే బరిలో ఉంటానని బహిరంగానే ప్రచారం చేస్తున్నారు. కోదాడలో కన్మంత శశిదర్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్​రావు, ఎర్నేని వెంకటరత్నం బాబు తదితరులు బుధవారం సమావేశం కావాలని నిర్ణయించారు.

మోత్కుపల్లి, బూడిదకు మొండిచెయ్యి 

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్​కు పార్టీలో ఎలాంటి స్థానం దక్కలేదు.  అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మోత్కుపల్లి ప్రకటించినా పార్టీ పట్టించుకోలేదు.  మునుగోడు ఎన్నికల్లో పార్టీలో చేరిన భిక్షమయ్యగౌడ్​కు కూడా ఎలాంటి పదవి లభించలేదు. ఎమ్మెల్యే సునీతతో వీరికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకున్నా  గౌరవం దక్కలేదన్న ఫీలింగ్​మాత్రం వెంటాడుతోంది.  వీరి  ప్రభావం ఎన్నికల్లో  కచ్చితంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇక భువనగిరి ఎమ్మెల్యే టికెట్​ఆశించిన చింతల వెంకటేశ్వరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించడం పార్టీకి డ్యామేజ్​అవుతుందని భయపడుతున్నారు. 

మునుగోడు  ఎమ్మెల్యే పైన తాడోపేడో...

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి నాయకత్వాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పెద్ద స్కెచ్​ వేశారు.  మొక్కుబడిగా కాకుండా గ్రామస్థాయిలో వార్డు మెంబర్​ నుంచి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని డిసైడయ్యారు. త్వరలో భారీసభ పెట్టాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కూసుకుంట్లను ఎమ్మెల్యేగా గెలిపించే ప్రసక్తే లేదని చండూరు, మునుగోడు, నారాయణపూర్​, చౌటుప్పు ల్​ నేతలు చెబుతున్నారు.